BHAGAVATA KADHA-3    Chapters   

ద్రౌపదీ వలువలూడ్చునపుడు కృష్ణ కృప

53

శ్లో || పత్న్యాస్తవాధిమఖక్లుప్త మహాభిషేక

శ్లాఘిష్ఠచారు కవరం కితవైః సభాయాం |

స్పృష్టం వికీర్య పదయోః పతితాశ్రు ఖ్యా,

యస్తత్‌ స్త్రియో7 కృత హతేశ విముక్తకేశః ||

- భాగ. 1 స్కం. 15 ఆ. 10 శ్లో.

''మ|| ఇభజిద్వీర్య మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లము9

సభలో శాత్రవు లీడ్చి తెచ్చినపుడా చంద్రాస్య దుఃఖింపఁగా

సభయంబిచ్చి ప్రతిజ్ఞజేసి భవదాయారాతి కాంతాశిరో

జభరశ్రీల హరింపఁడే విధవలై సౌభాగ్యముల్‌ వీడఁగ9 ||''

- శ్రీ మదాంధ్ర భాగవతము.

ఛప్పయ.

రాజ9 కహఁకహఁ కహూఁ, కరీ హమరీ రఖవారీ|

దుష్ట ఫంద మేఁ ఫఁసీ, ద్రౌపదీ ప్రియా తువ్హూరీ ||

జీనమేఁ ఛీఁటే రాజసూయ పయ కేశుభ లాగే |

ఖోలే ఖీఁచే కేశ ఖలని నే సబకే ఆగే ||

రోఈ అతి హీ దీనహై, రక్షా నహిఁ కాహూ కరీ ||

కృష్ణ పుకారే కరుణ స్వర, కాన భనక ఉనకే వరీ ||

అర్థము

''అన్నా! ధర్మరాజా! శ్రీకృష్ణుఁడు మనల రక్షించిన సందర్భములను ఇంక ఎంతని చెప్పుదును? ఏ నీభార్యయగు ద్రౌపది రాజసూయ యాగములో నవబృధస్నాదాలందు పవిత్ర మంత్ర జలములతో నభిషిక్తయైనదో ఆమెదుష్టుల చిక్కులలోఁ బడినది. ఆమె నాకౌరవ హంతకులు అందఱముందు కొప్పుపట్టుకొని లాగిరి. చీరలు విడువ సాగిరి.

అట్టి నామె అతిదీనయై ''నాకు రక్షకులు లేరు. రక్షించు వారెవరు?'' అని కరుణా స్వరమునఁగుయ్యడఁగా నా పిలుపాతని చెవినిఁబడెను.''

నిరంతరము భగవత్స్మరణకలుగు దుఃఖము అందఱకు, ఎల్లప్పుడు లభించిన బాగుండును. భగవత్సంబంధములో కలిగెడు దుఃఖంము దుఃఖము కాదు. అది పరమ సుఖము. బృందావన విహారి సంబంధములోఁగలిగిన విరహవ్యథ విరహ మనఁబడదు. అది మానసిక ఘనిష్ట సంయోగమునకు జనని. అవినాశి యెన్నటికి నాశము కాఁడు. పరోక్షముమగును ఈ చర్మచక్షవుల కాతఁడు కనఁబడకుండును. ఆతఁడు బాహ్యదృష్టిచేఁ గనఁబడకపోఁగానే అంతర్దృష్టితో నాతనిని జూచుటకుఁ బ్రయత్నింతురు. ఇదియే మోక్షము. ఇదియే పరమానంద సుఖము. కావున శ్రీకృష్ణ సంబంధమగు రోదనము మోక్షమార్గసోపాన స్వరూపము.

అర్జునుఁడు జరాసంధ వధాసమయమున శ్రీకృష్ణకృపను గూర్చి వర్ణింపఁగానే ధర్మరాజుకూడ అత్యంత గద్గదికుఁడయ్యెను. ఆతఁడు రోదనముచేయుచు నిట్లనెను:- ''అర్జునా! నీవీ విషయములన నన్నింటిని వినిపించి మరణమునుండి నన్నడ్డగించుచున్నావు. నీవు చెప్పునది కథకాదు. నీవాక్కను పిచికారీద్వారా నా చెవుల కుండా సంజీవనీ రసమును హృదయమున కెక్కించుచున్నావు. వాగ్రూపమగు పాత్రలో నింపి కర్ణములను నా కంఠములో ననుపమామృతమును బోయుచున్నావు. ఎంతవఱకు నీ వీ విధముగ మధుమయ, ఆనందమయ, జీవనమయ, సారమయ కథా రసమును ద్రావించెదవో అంతవఱకు నా హృదయము బ్రద్దలు కాదు, నా చేతనము విలుప్తముకాదు. నేను సంజ్ఞాశూన్యుఁడను కాను. ఇంకను వినుపించుము నాయనా! నా ప్రియసోదరా! అర్జునా! పాపవర్జనా! నన్ను రక్షింపఁదలచితివేని కథాతంత్రిని ద్రెంపవలదు.''

ధర్మరాజు పలుకఁగా నా వాక్యములను విని అర్జునుఁడు కన్నులు తుడుచుకొనెను. తన ప్రియులను గూర్చి చెప్పినను హృదయము స్వయముగ హర్షించును. ఆ కారణమున నర్జునుడు కూడ, ఎవరైన నవ్యగ్రచిత్తముతో వినువాడుండినచో యుగ యుగాంతరముల వఱకు ఇదేవిధముగ శ్యామసుందరుని సుఖద సంస్మరణమునుగూర్చి చెప్పఁగోరుచుండెను. తనవలె ధర్మరాజు, సభాసదులు, అక్కడనున్న బంధువులు శ్రీకృష్ణకథా శ్రవణకుతూ హలులై యున్నారను సంగతిని దెలిసికొని అర్జునుఁడిట్లనెను:-''ఒక్కవిషయమైనఁజెప్పగలను. కాని ఆతనిది ఎన్నటికిని అంతము గాని కృప. ఒక నమ్మకమైన సేవకునివలెను, స్వామి భక్తుఁడగు భృత్యునివలెను మనలను, మన పరివారమును, మన పదవీప్రతిష్ఠలను, రాజ్యరక్షణమును జేయుచుండెడివాఁడు, ఎచ్చట స్మరించిన నచ్చటనే యుండెడివాఁడు. ఆతఁడు స్వయముగ నుండుట ఉపచారమాత్రమే. ఆతఁడు సర్వాంతర్యామి. సమస్త జీవులందును సమానముగ వ్యాపించియున్నాఁడు. ఆతఁడొకచోటనుండి రావలసిన పనియు లేదు. ఒకచోటకు వెళ్ళవసిన పనియు లేదు. భక్తుల ప్రేమతోఁబిలిచిరా ఆతఁడక్కడనే ఆ క్షణముననే ప్రత్యక్షము. అయితే మనయొక్క అందఱ హృదయములలో అట్టి ప్రేమ లేదు. ప్రేమశూన్యులమగు మన సమ్ముఖమున నాతఁడు ప్రత్యక్షమగుట కేవల మాతని అహైతుక కృపవలననే.

అతుల వైభవోపేతమగు మీ రాజసూయయాగమున గాంచి దుష్టులకు అపారమగు ఈర్ష్య కలిగినది. దర్యోధనునకు మయసభలో జలమున్నచోట స్థలముగను, స్థలమున్నచోట జలముగను గోచరించెను ఆతఁడు మీయైశ్యర్యమును గాంచి ఈర్ష్యావశమున దుఃఖితుఁడై దృష్టిహీనుఁడయ్యెను. దుష్టులందఱునుజేరి ద్యూతసభ నేర్పఱచిరి. నిన్ను నీసోదరులను జూదమాడఁ బిలిచిరి. ధర్మాఆనుసారముగా వారియాహ్వానమును స్వీకరించి మనమందఱమును ఇంద్రప్రస్థమునుండి హస్తినాపురము నకుఁబోయి మన సర్వస్వము నోడి, చివరకు ద్రౌపదినిగూడ ఓడిపోయితిమి. దుర్యోధనుని మాయయగు శకుని, ఆతని సోదరుఁడగు దుశ్శాసనుఁడు, కర్ణుఁడు వీరందఱును గలసి అనేక కపటోపాయములచే మోసముచేసి మిమ్ములను బరాజితులఁగావించిరి. సోదరులమగు మమ్ములనందఱ నోడిపోయితిరి. చిరకు ద్రౌపదిని గూడ నోడిపోవ, నియమానుసారముగ గెలిచినవారికే దాసి యయ్యెను. అప్పుడు వారికి వారి ఈర్ష్య నణఁచుకొనుట కవకాశము చిక్కెను. నిన్నెట్లైన నవమానము చేయవలెనను హేయబుద్ధిచే హేయకార్యములను జేయఁప్రారంభించిరి.

లోకములో నిట్టి పాపమెవరైనఁ జేయఁగలరా? స్త్రీ సదా అవధ్య. అది యేజతిదైననగుఁగాక, తన ప్రాణము లొడ్డి యైనను ఆస్త్రీ సతీత్వమును రక్షింప వలయును. అదెట్టి స్త్రీ యైన నగుఁగాక, దాని నందఱముందు అవమానము చేయరాదు. ఏవర్ణములోనున్న స్త్రీయైన నగుఁగాక, అది దుఃఖములోఁబడెనా దానిని బ్రయత్నించి దుఃఖమునుండి బయట పడవేయవలయును. ఇట్లు శాస్త్రకారు లనేకచోట్ల చెప్పియున్నారు.

రాజులై, తన యింటిలోఁదన అన్న భార్య, అంతే కాదు చక్రవర్తిని, చక్రవర్తియగు భర్తతోఁగూర్చుండి రాజసూయ యజ్ఞ దీక్షను గొన్నది, చేత జింక కొమ్మును ధరించి భర్తతోఁ గూడి యజ్ఞమునకు సంబంధించిన కఠిన నియమములను పాలించినది- అట్టి దేవవంద్యయగు రాజమహిషిని నిండుసభలో నామె సిగ్గును దీసివేయవలెనని యవమానింపఁగలరని ఎవరైన నూహింపఁ గలరా? ఇట్టిపని క్రూరులగు రాక్షసులుకూడ చేయరు. దైత్య దానవులుకాడ తమ కులస్త్రీల నెల్లప్పుడు నాదరించుచుందురు. వారి యవమానమే తమ యవమాన మను కొందురు. ఆ ద్యూత సభలో నందఱు ఊరక స్మరించిననే రోమములు నిక్కపొడుచునట్టి ఘోరకార్యము నొనర్చిరి. ఆ సమయమున నందఱ బుద్ధుల మీఁద తెఱపడినది. అందఱు కులాగత ధర్మమును మఱచిరి, అందఱు సదాచారమునకుఁ దిలాంజలు లొసంగిరి. దుష్లుఁడగు దుర్యోధనుఁడు ద్రౌపదిని నిండుసభలోనికిఁ దీసికొని రమ్మని దుశ్శాసనున కాజ్ఞాపించెను.

ఆతని యీ క్రూరాజ్ఞాను విని మనమందఱము కిక్కురు మనకుంటిమి. మనకర్తవ్యమును నిశ్చయించుకొనలేక పోయితిమి. మీరు ధర్మపాశబద్ధులై నిశ్చేష్టులరై కూర్చుంటిరి. క్రురుఁడగు నాదుశ్శాసనుఁడు లోపలికిపోయి రాజసూయ యాగమందును. అశ్వమేధ యజ్ఞమందును మంత్రజలములచే నిభిషిక్తము కావింపబడిన అలినీలాలకములగు కమనీయ కేశములను బట్టుకొని పట్టపురాణియగు ద్రౌపదిని యీడ్చుకొని వచ్చెను. ఆమెను సరిగా స్వచ్ఛందముగఁ దిరుగు పక్షులు కానిండు, గగన విహారి యగు భాస్కరుఁడు గాని చూచి యెఱుఁగరు. ఉచ్చులలోఁ జిక్కుకొన్న లేడిపిల్లవలె నీ ప్రియగృహిణి చాల విలపించెను; వ్యాకులయై ప్రేలెను. ఆమె దీనతతో నా దుష్టుని దయాభిక్ష నడిగెను. కాళ్లు పట్టుకొని యామె యిట్లనెను:- ''మఱఁదీ! ఇట్టి పాపమునకు వడిగట్టుకొనకుము. నేనిప్పుడేకవస్త్రను. రజస్వలను. అందఱ సమ్ముఖమున రావీలులేదు. నన్నవమానింపకుము. నా సిగ్గును దీయకుము. నన్ను వారాంగనవలె సభలోనికిఁ గొనిపోవకుము. నేను నీకు నమస్కరింతును. పాదములఁ బట్టుకొందును. నేను పరాయిదానను గాను. మీయన్న భార్యను.'' కాని యాదుష్టుఁడు ఒక్కమాటయైన వినలేదు. ఆమె యనునయ వినయములను ఆతఁడు విననేలేదు. ఆమె నవమానపూర్వకముగఁ గొప్పు పట్టుకొని యీడ్చెను.

ఆ సమయమున సభాసందులందఱును దఃఖించిరి. ఎవఁడు నొక్కమాటైనఁ బలుకలేదు. భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రాది గురుజనులందఱును మౌనముగ నుండిరి. ద్రౌపది మాటిమాటికి కాతర దృష్టితో భయభీత హరిణ శాబకము పోల్కి మీవైపు చూచుచుండెను. ఆమె తన దీనదశను జెప్పుకొనుచు నీవు రక్షింతువని యాశించెను, కాని నీవామె వైపునఁ జూడనైనఁ జూడ లేదు. సభాసదులందరు తలలు వంచిరి. ద్రౌపది నేత్రములనుండి అగ్నికణములు రాలుచుండెను, కాని ఆమె మీశీతల ముఖమును గాంచఁగానే శాంతురాలయ్యెడిది. ఆమె యా యధర్మసభను భస్మము చేయలేదు. ఆమె నిన్నుఁజూచుచుండెను. మేమును మీ ముఖమును జూచుచుంటిమి. మీరు ధర్మము నాశ్రయించితిరి. ధర్మము ఆధర్మము రెండును సంసిద్ధముగ నుండెను. ఆ ధర్మము సచ్చరిత్రయు, ధర్మశీలయు నగు ద్రౌపదిని రక్షించుట కసమర్థురాలయ్యెను.

ఎటుచూచినను ఆమెకు నిరాశకలిగెను. ఎవ్వరు నామెను రక్షింతురను ఆశ##లేదు. అంత నామె అశరణ శరణుఁడు దీనబంధువు నగు కృష్ణునిఁబిలిచెను. ఏడ్చి, కన్నుల నీరు గార్చి, దీనతతో నామె కేకవేసి యిట్లనెను:- ''హా! శ్యామసుందరా! నాథా! ఎచ్చటికి పోయితివి? ప్రభూ! రక్షించుము. దుష్టులు నాసిగ్గు తీయఁదలచుఁచున్నారు. భక్తభయంభంజనా! భగవాన్‌! నా భయము నేల తీసివేయవు? ఈ దుష్టుల నేల యమపురము నకుఁబంపవు? ప్రభూ! నీ దాసీనని పిలువఁబడుచు నా కవమానము జరిగిన నది నాకు కాదు; నీకే. అశరణశరణా ! ఎటు చూచినను దిక్కుమాలి నీ దిక్కు చేరితిని.''

రాజా! ఆ సమయమున భగవానుఁడు స్వరణమాత్రము చేతనే అచ్చటికి పరువిడి వచ్చెను. అందఱ కాతని ఘనశ్యామరూపము కనఁబడలేదు. ఆతఁడచ్చట సత్యద్భుతమగు నవతార రూపమునఁ బ్రత్యక్షమయ్యెను. ఆతఁడాసమయమున నీలవర్ణమును వదలిపెట్టి వివిధవర్ణుఁడయ్యెను. ఆ సమయమున అండజ, పిండజ, ఉద్భిజ, స్వేదజాది శరీరములను వదలి యాతఁడు వసన రూపమును ధరించెను. ఆతని చేతనతవలన జడము కూడ చైతన్యమయ్యెను. సాంతములో ననంతదృశ్యమును జూపించెను. దుశ్శాసనుఁడు ద్రౌపదీవస్త్రముల నూడ్చిన కొలది అవి పెరిగిపోవు చుండెను. ఆమెనుండి చిత్రవిచిత్రములగురంగులుగల సుందర వస్త్రములు ఒకేనూలుతో నేయఁబడినట్లు బయలుదేరి వచ్చుచుండెను. వాఁడు ద్రౌపదిని వస్త్రహీనను జేయవలె ననుకొనెను, కాని వాఁడు బలహీనుఁడైపోయెను. ఆఁతడు చీరెలు విప్పి యెట్లైనను పాండురాజు కొడలును, మన ప్రియమైన భార్యయు, ద్రుపదరాజ పుత్రియు నగు ద్రౌపదిని నగ్నగాఁజేయవలెనను పట్టుదలతో నుండెను. కాని యాచమత్కారమును గాంచఁగానే వాని మద ముడిగిపోయెను. వాఁడు సిగ్గుపడి కూర్చుండెను. సభ యంతయు స్తబ్ధమయ్యెను. ఆ విచిత్రవసనములు నిండుసభలో నాకాశమున ననేకములగు నింద్రధనుస్సులుదయించి ఒక్క చోటకు చేరినట్లు పడియుండెను. పెద్ద గుడ్డల దుకాణము వలె నాసభకనఁబడెను. దానిలో నేడ్చుచు నిలుచున్న కృష్ణ కృష్ణునిఁ బ్రత్యక్షముగఁగాంచుచుండెను. సభలోనికి వెంటనే కృష్ణుడు వచ్చెను. ఇప్పుడాతని పాదములు కడుగుటకు పాద్యజలముల నెక్కడనుండి తేవలయును? ఆమె తన కాటకకంటఁ గారిన నేత్రాశ్రువులచే శ్యామసుందరుని శ్యామలారుణ పాదతలములను గడిగెను. ఆ సమయమున నాతఁడామె నోదార్చుచు శ్యామసుందరుఁడామెతో నిట్లనెను:- ''దేవీ! ఇప్పుడు నీవు విఱియఁబడిన నీ కేశ పాశములను ముడుచుకొనుము. ఇఁక నేను వచ్చితిని. నీకిఁక భయమేమియు నుండఁజాలదు.''

రోదనము చేయుచు ద్రౌపది యిట్లనెను:-న ''శ్యామ సుందరా! ఇప్పుడీ కేశములు వీడినవి. వీడినవేమో వీడినవి. ఏనుఁగు కోరలు బయటకు వచ్చినవేమో వచ్చినది. కులీన కన్యకు ఒక్కసారి కన్యాదానము అయినదేమో అయినట్లే. పాలు ఒక్కసారి విరిగిన విరిగినట్లే. ముత్యమొక్కసారి పగిలిన పగిలినదే. వస్త్రమొక్కసారి చినిఁగెనా చినిఁగినట్లే. ఇవన్నియు మరలఁదను పూర్వరూపములను బొందనట్లే దుష్టుల కలుషిత కరములచే స్పర్శింపఁబడిన యఅ కేశపాశములు వెనుకటివలె సౌభాగ్య చిహ్నములచేఁ జిహ్నితములై వేణీబంధము చేయఁడగవు.''

మీగృహిణి యిట్లు దృఢ ప్రతిజ్ఞ జేయుటను విని శ్యామసుందరుఁడు నవ్వుచు నిట్లనెను:- ''దేవీ! వెనుకటి వలె నాకేశముల నెప్పుడు మరల ముడిచెదవు? నీకిట్లు విరియఁ బోసిన తల బాగుండలేదు. అవి బంధింపఁబడి నాగినివలెఁ గనఁబడవలెనని నాకోరిక. నేను వేణీప్రియుఁడను. అందువలననే నాకు వేణీమాధవుఁడను పేరు కూడ కలదు. ఈ విరియబడిన వెండ్రుకలెట్లు వేణిగా నేర్పడఁగలవో ఆ ఉపాయమును నాకుఁ జెప్పుము. ఏపని చేసిన నీకుటిల నీలకేశములు బంధింప వీలగునో ఆ ఉపాయములను నాకుఁజెప్పుము.''

అంత ద్రౌపది యిట్లనెను:- ''ప్రభూ! ఈ కేశములు లాగినవారి భార్యలు విధవలై యీ విధముగ తలలు విరియ బోసికొని యెప్పుడేడ్చెదరో అప్పుడీ కేశములు బంధింపఁబడును. ఏ చేతులతో నీ కేశములు లాఁగఁబడినవో అట్టివాని చేతులు వాని బాంధవులతోసహా నిర్జీవములై తెగఁగొట్టఁ బడిననాఁడు ఈ వేణీ బంధింపఁబడును. ఈ కేశములు లాఁగినవాని శవమును కుక్కలు నక్కలు లాగి పీఁకుకొని తినుచున్నప్పుడీ కేశములకు సంస్కారము జరిగి బంధింపఁబడును. ఈ పవిత్ర కేశముల నేమూర్ఖుఁడు పీఁకెనో, వాని మృత శరీరమును కాకులు గ్రధ్దలు పీఁకుచున్నప్పుడు జడగా బంధింపఁబడును.''

క్రోధితయగు ద్రౌపదీదేవి కఠోర దృఢవచనములను విని శ్యామసుందరుఁడామె నోదార్చుచు నిట్లనెను:- ''పాండవపత్నీ! ద్రుపదకుమారీ! నీవు భయపడవలదు. అట్లే అగుఁగాక! నేను నీ శత్రువుల నందఱ సంభారముచేయించి వారి సమస్తకులమును నాశముచేయించి వారి పత్నుల కేశములను విరియఁబోసికొను నట్లు చేసెదను. అప్పుడు నీ జుట్టు ముడివేయించెదను. దేవీ! నే నింతవఱకు అసత్యమాడలేదు. ఇఁక నాడఁబోను.''

మహారాజా! ఆ సమయముననే కౌరవు లంతమైరి. వారి శ్రీలన్నియు నాశనమైనవి. వారు మృతతుల్యులైరి. మన ధర్మ వృద్ధి కొఱకును. లోకములో మన పాపనతను. ప్రసిద్ధిని స్థాపించుట కొఱకు శ్రీకృష్ణుడప్పుడు కౌరవులను జంపలేదు. అతఁడు తలఁచుకొనినయెడల సమస్తబ్రహ్మాండము నాతఁడు భస్మము చేసియుండెడువాఁడే; కాని ఆతఁడు మనలను ధర్మమందునిచి, మనచేతులతోడనే వారిని జంపింపవలయునని ఆతఁడట్లు చేసెను. ద్రౌపదీదేవి ప్రతిజ్ఞను అక్షరశః నెఱవేర్చెను. ఎంత చెప్పనో అంతయుఁ జేసి చూపించెను. సమస్తకౌరముల పత్నులను విధవలభ##జేసి వారి సమ్ముఖముననే అమె కేశపాశములను బంధింపఁజేసెను.

ఆతని కృపనుగూర్చి యెంతని వర్ణింపగలను? ఏశబ్దము లతో వర్ణింపగలను? నాశిరస్సున శ్యామసుందరుని శ్రీహస్తము కలదని నేను నిశ్చింతతో నుంటిని. ఘనశ్యాముని శీతల ఛత్రఛాయ కలదనుకొంటిని. ఆ ఛాయ యెక్కడ విలీనమైనదో తెలియదు. నా శిరస్సుమీఁద నిప్పుడా శ్యామల, శీతల, వరద కరకమలము కలఁబడుటలేదు. ఇప్పుడు నేను నిస్సహాయుఁడనైతిని. ఇప్పుడు నన్ను నేను రక్షించుకొనుటకుఁగూడ శక్తిలేని వాఁడనైతిని. నా చాతురియంతయు బోయినది. నా పరాక్రమమంతయుఁ బ్రభువు పోఁగానే సమాప్తమైనది. రాజా! ద్రౌపదిని రక్షించినవాఁడును. ఆమె కేశపాశములను మరల బంధించినవాఁడు నగు వాసుదేవుఁ డెచ్చట విలీనమైపోయినాఁడో కదా! అయ్యో! నే నాతని పునీతప్రేమ నిఁక నెట్లు చూరకొనఁగలను? ఆతని పాదపద్మములకుఁ బ్రణతుఁడనై ఎప్పుడు నాతల వ్రాల్చెదను? అనుచు నర్జునుఁడు బిగ్గఱగ నేడ్వఁబ్రారంభించెను.

ఛప్పయ

భరీ సభా మేఁ ఆఇ చీర ఉన అక్షయ కీన్హోఁ |

దుఖిత దయానిధి భ##యే, దండ దుష్టని కూఁదీన్హోఁ ||

జిన కచ ఖీఁచే వధూ బనీఁ విధవా ఉన సబకీ|

భోలేఁ డోలేఁ కేశ, ప్రతిజ్ఞా పూరీ తబ కీ ||

సదా దుఖీ దుఖ మేఁ రహే, సుఖీ సబని సుఖ దే భ##యే |

కింతు అంతమే అకేలే, తను తజి నిజ పుర చలి గయే ||

అర్థము

శ్రీకృష్ణుఁడు నిండుసభలోనికి వచ్చి ద్రౌపదికి అక్షయ వలువ లొసంగెను. దయానిధి దుఃఖితుఁడై దుర్మార్గుల శిక్షించెను. ద్రౌపది కొప్పు పట్టుకొని ఎవరు లాగిరో వారి భార్య లందఱు విధవలైరి. ఆమె కేశపాశములను విడువఁగా నామె ప్రతిజ్ఞలను పూర్తి కావించెను.

సర్వదా దుఃఖులను దుఃఖములలోను, సుఖులను సుఖములలోను బెట్టి చివరకు నన్నొంటిగా వదలి నిజధామమున కీతనువును విడిచిపోయెను గదా!

BHAGAVATA KADHA-3    Chapters